శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం యొక్క తాజా ప్రచురణ ముఖపత్రం శ్రీపాద శ్రీవల్లభులంటే ఎవరు ?
శ్రీపాద శ్రీవల్లభ స్వామివారి గురించి మనందరికీ ఈ పుస్తకం వెలువడకముందే కొంచెం తెలుసు. మౌలికంగా మరాఠిలో రచించబడిన 450ఏళ్ళ నాటి శ్రీ గురుచరిత్ర అనే గ్రంథంలో మొదటి 10 అధ్యాయాల్లో ఆయన గురించి వర్ణించబడి ఉంది.అయితే అందులో స్వామివారి గురించిన విస్తారమైన విశేషాలేమీ లేవు.ఆయన స్వయంగా దత్తాత్రేయ స్వామి అని కలియుగంలో మొట్టమొదటిసారిగా అవతరించినప్పుడు ఫలానావారి ఇంట పిఠాపురంలో జన్మించారని చిన్న వయసులోనే సన్యాసం స్వీకరించి దేశాటన చేశారని చివరిగా మహబూబ్‌నగర్‌జిల్లాలో కృష్ణానది ఒడ్డున ఉన్న కురువపురంలో స్థిరపడి అక్కడే తమ భౌతిక స్వరూపాన్ని గుప్తం చేశారని శ్రీ గురుచరిత్ర పేర్కొంటోంది. శ్రీ గురు చరిత్రని తెలుగులోకి తెచ్చినవారు ముఖ్యంగా ఇద్దరు.ఒకరు శ్రీ బోధానందేంద్ర సరస్వతీస్వామి.రెండోవారు ఆచార్య ఎక్కిరాల భరద్వాజగారు.(ఈయన సాయిమాష్టర్‌గా సుప్రసిద్ధులు).అయితే ప్రస్తుతం వీరిలో ఎవరూ సశరీరంగాలేరు.
శ్రీపాద శ్రీవల్లభస్వామివారు ప్రస్తుతం మనం షిర్డీసాయిబాబాగా కొలుస్తున్న భగవంతుడికి పూర్వావతారం.ఈమధ్యలో కూడా చాలాఅవతారాలున్నాయి.శ్రీపాదశ్రీవల్లభులు మహబూబ్‌నగర్‌జిల్లాలో తమ భౌతిక స్వరూపాన్ని గుప్తం చేసిన తరువాత తాము ఒకప్పుడు ఇచ్చిన వాగ్దానాన్ని అనుసరించి మహారాష్ట్రదేశంలోని కారంజనగరంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో నరహరి అనే పేరుతో జన్మించారు.ఆయన ఎనిమిదో ఏటనే ఇల్లు విడిచి కాశీ వెళ్ళి అక్కడ కృష్ణ సరస్వతీస్వామి అనే గురువు దగ్గర సన్న్యాసదీక్ష స్వీకరించారు.అప్పుడు గురువుగారు ఆయనకిచ్చిన దీక్షానామం శ్రీనృసింహ సరస్వతీస్వామి అనేది.తరువాత ఆయన దేశాటన చేసి కర్నాటక మహారాష్ట్ర దేశాల సరిహద్దుల్లో ఉన్న గాణగాపురం అనే చోట అమరజా నదీ తీరంలో ఆశ్రమం స్థాపించుకుని అక్కడే 60సంవత్సరాలకి పైగా ఉండిపోయారు.ఆ కాలంలో ఆయన ఎన్నో లీలలు ప్రదర్శించారు.ఆ ఆశ్రమం ఉన్న చోట ఇప్పుడు ఒక మహాదేవాలయం ఉంది.ఈ రచయిత కూడా ఆ ఊరు సందర్శించడం జరిగింది.
తరువాత శ్రీనృసింహ సరస్వతీస్వామివారు ఆంధ్రా వచ్చి శ్రీశైలం దగ్గర పాతాళగంగ మీదుగా కర్నూలుజిల్లాలోని కదళీవనమనే ప్రాంతానికి చేరుకుని అక్కడ 360సంవత్సరాల పాటు ఘోరతపోదీక్షలో మునిగిపోయారు.క్రీ.శ.1820ప్రాంతాల్లో ఆయన తపోదీక్ష విరమించి హిమాలయ ప్రాంతాలకి వెళ్ళి మళ్ళీ మహారాష్ట్ర వచ్చారు.అక్కడ ఆయన ఎంతో మందిని ఆధ్యాత్మికంగా ఉద్ధరించి కొంతమందిని మహాయోగులుగా మార్చిన తరువాత మహారాష్ట్రలోని అక్కలకోట అనే గ్రామంలో క్రీ.శ.1875 ప్రాంతంలో సమాధి చెందారు.చివరి సందేశం ఇమ్మని వేడుకున్న భక్తులతో ఆయన "కొత్తగా చెప్పడానికేముంది నాయనలారా ? మీ తాతతండ్రుల మార్గంలోనే నడవండి"అని చెప్పి కన్నుమూశారు.
ఆ అక్కలకోట స్వామివారే మనం పూజిస్తున్న షిర్డీసాయిబాబా.ఒకసారి అక్కలకోట వెళ్ళొస్తానన్న భక్తుడితో షిర్డీసాయిబాబా,"ఇప్పుడు ఆక్కడ ఏముంది ? ఆ స్వామి ఎవరో కాదు.నేనే"అని తెలియజేశారు.
ఈ విధంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సంయుక్త స్వరూపమైన శ్రీ దత్తాత్రేయస్వామివారు అనేక రూపాల్లో అనేక జన్మలెత్తుతూ అనేక దేశాల్లో తన అవతారాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తూనే ఉంటారని మన పూర్వగ్రంథాలు చెబుతున్నాయి.ప్రపంచంలో నలుమూలలా వివిధ మతాల్ని స్థాపించేవాడు ఆయనే.ఇప్పుడు ప్రపంచంలో ప్రచారంలో ఉన్న వివిధమతాల స్థాపకులైన 77మంది మహాగురువులకి ఆయన పరమ గురువు.ఏ గురువు ఎప్పుడు ఎక్కడ జన్మించాలో ఏ జాతికి ఏ విధమైన బోధలు చెయ్యాలో శాసించి నియమించేవాడాయన.తన కార్యక్రమానికి అనుగుణంగా వివిధ దేశాల్లో ప్రభుత్వాల్ని రాజుల్ని సింహాసనమెక్కించేవాడు పడగొట్టేవాడు కూడా ఆయనే.దేశం ముస్లిముల చేతిలోకి వెళ్ళినప్పుడు హిందూమతానికి దెబ్బతగలని విధంగా హిందూమతాభిమానులైన ముస్లిముల్ని గద్దెనెక్కించినవాడాయన.(ఆక్బరు, బీదర్ సుల్తానులు, గోల్కొండ నవాబులు, బెంగాల్ నవాబులు అలాంటివారే).తన అనుయాయిలైన 77మంది మహాగురువుల సంఖ్యని 1,25,000కి పెంచి జీవులన్నింటికీ మోక్షమార్గాన్ని ఇంకా సులభతరం శీఘ్రతరం చేసే బృహత్తర వజ్రసంకల్పంతో ఆయన నిరంతరాయంగా పనిచేస్తున్నాడు.ఆ మహాగురుపీఠాన్ని అందుకోవడానికి సిద్ధపడగల ఆధ్యాత్మికులు ఆయనకి కావాలి.
ఆ సర్వశక్తిమంతుడైన పరమేశ్వరుడు తెలుగువారి పుణ్యం పండి 14వ శతాబ్దపు తొలి దశాబ్దాలలో పిఠాపురంలో జన్మించి తన ముప్ఫయ్యో ఏట ఆ అవతారాన్ని గుప్తం చేశాడు.
రాబోయే టపాలో : శ్రీపాద శ్రీవల్లభస్వామివారి సంక్షిప్త జీవిత కథ